నా కథే… నీ కథ
- Srinivasa Malladi

- Nov 22
- 2 min read
Updated: 7 days ago
కథ ప్రారంభం

“నా కథ వినాలనుకుంటావా? అయితే విను.” కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం మొదలైయ్యింది నా కథ. అప్పుడు ఏమీలేదు. ఇవాళ రేపు అనేటటువంటి కాలము కూడా లేదు. అప్పుడు నేను పుట్టలేదు. ఈ భూమి, సూర్యుడు, నక్షత్రాలు, ఆకాశం—ఏవీ ఇంకా పుట్టలేదు. అంతా నిశ్శబ్దం… చీకటి. కొంచెం విచిత్రంగా ఉంది కదూ! ఇంకా విను.
చీకటిలో దాగిన వెలుగు
అంతటా చీకటిగా ఉన్నా చీకటి అవతల ఒక ప్రకాశవంతమైన వెలుగు ఉండేది. అక్కడ ఒకటే ఉండింది — దానినే ఏకత్వం అంటారు. పోతనగారు భగవతములో,
"లోకంబులు లోకేశులు లోకస్థులు దెగినతుదిన లోకంబగు
పెంజీకటికవ్వల నెవ్వండేకాకృతి వెలుగు నతని నే సేవింతున్"
అని స్వయంప్రకాశమైన ఆ ఏకత్వమే భగవంతుడు అని ఇదే విషయం చెప్పారు.
అయితే ఏకత్వం మార్పు లేనిది. దానినే సత్-చిత్-ఆనందం అని కూడా అంటారు. ఊహకు అందనటువంటి ఆనందం మరియూ జ్ఞానం ఆ ఏకత్వం. దానినే పరబ్రహ్మము అంటారు. ఎందుకంటే అంతటినీ సృష్టించేది అదే. సృష్టించినవి అన్నీ అందులోనే ఉంటాయి. అదే అన్నిచోట్ల వ్యాపించే శక్తి.
నా పుట్టుక

ఆ సంపూర్ణ ఏకత్వం నుంచే…ఒక చిన్న అలలాగ నేను బయల్దేరాను. అదే నా కథకు ఆరంభం.
నన్ను ఆత్మ అని అంటారు. నా అసలు పేరు అదే. అయితే నిజానికి నాకు పేరు రూపం ఉండవు కానీ నేనెవరో తెలియాలి అంటే ఒక పేరు ఉండాలి కదా? అందుకే ఆత్మ అని అంటారు.
సృష్టి ప్రారంభం
ఆ పరబ్రహ్మ అనే వెలుగులో నుంచే మొదట బ్రహ్మ గారు పుట్టారు. “నేను ఎక్కడినుంచి వచ్చాను?” అని చూస్తూ నాలుగు వైపులా చూశారు. అప్పుడు ఆయనకు నాలుగు తలలు వచ్చాయి. అందుకే ఆయనను చతుర్ముఖ బ్రహ్మ అంటారు.
ఆ తరువాత— కాలం, ఆకాశం, నక్షత్రాలు, దేవతలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, గాలి, పక్షులు, జంతువులు,చెట్లు, నదులు, సముద్రాలు— ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ చతుర్ముఖ బ్రహ్మ వలే ఆ ఏకత్వం నుండే పుట్టాయి.
ఇన్ని పుట్టినప్పటికీ కూడా పరబ్రహ్మము తరగదు మారదు. సృష్టి అంతా జరిగినా పరబ్రహ్మము అనే ఏకత్వం మాత్రం మారదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ।
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
ఈ శ్లోకం లో అదే చెప్పబడుతోంది. ఉదాహరణకి పెద్ద సముద్రంలో ఒక చుక్క నీరు తీస్తే సముద్రం లో మార్పు ఎలా కనబడదో అలాగే. అయితే, ఆ ఏకత్వం యొక్క ప్రతిబింబం ప్రతిదానిలోనూ కనబడింది.
ఆ ప్రతిబింబమే ఆత్మ. అదే నేను…నాలో ఉన్నదే అందరిలో ఉంది.
నేను మరిచిపోయిన నిజం

నేను ఎప్పటినుంచో ఉన్నాను. పుట్టుక, మరణం, ఎదుగుదల—వీటితో నాకు సంబంధం లేదు. కానీ ఈ దివ్యత్వాన్ని అనగా — “నేను ఆత్మను” అనే సత్యాన్ని మర్చిపోయాను. అప్పటినుంచి— ఎన్నో జన్మలు, ఎన్నో శరీరాలు…జననం–మరణం–పునర్జన్మ. అబ్బో ఎన్నిసార్లు పుట్టానో లెక్కే లేదు.
మళ్లీ గుర్తొచ్చిన రోజు
ఈ మధ్యనే ఒక రోజు నేను దేవాలయంలో సంపూర్ణ భక్తితో ధ్యానం చేస్తూ నా లోపలికి చూసాను.“నేను ఎక్కడి వాడిని? నా నిజస్వరూపం ఏమిటి? నా జీవన గమ్యమేమిటి?” అని ప్రశ్నించాను. అప్పుడు నా అంతర్లోకం వెలుగులా తెరుచుకుంది. నాకు తెలిసింది: “అందరిలోనూ ఉన్నది అదే పరబ్రహ్మము.” అదే ఆత్మ. అదే నేను. అందరూ ఒకరే. అందరినీ ప్రేమించాలి.”
నా ప్రయాణం—నీ ప్రయాణమే
ఇప్పుడు ఆ ఏకత్వానికి చేరాలని నా హృదయం ఆనందంతో ఎదురు చూస్తోంది. కానీ మళ్లీ మర్చిపోతానేమో అనిపించింది. దానికి ఉపాయం ఏమిటి? అని ఆలోచించాను. అప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట గుర్తొచ్చింది: “నువ్వు మంచి మనస్సుతో ప్రయత్నం చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. జ్ఞానం ఇస్తాను. నీ మార్గాన్ని చూపిస్తాను.”
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం ।
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ॥
అది అర్జునుడికి చెప్పిన మాటే అయినా నాకు చెప్పినట్టే అనిపించింది.
మార్గం
ధ్యానం, కృషి, భక్తి, నిస్వార్థ ప్రేమ— ఇవే నా మార్గం. ఇవి నా గమ్యాన్ని చూపించాయి.
ముగింపు — మన అందరి కథ
ఇది నా కథ మాత్రమే కాదు. ఇది నీ కథ కూడా. ఇది మన అందరి కథ.
ఓం తత్ సత్
రచన: హిందూమిత్ర Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి



Comments